యేసు క్రీస్తు సేవకుడైన పౌలు నుండి: దేవుడు తన అపొస్తలునిగా [*అపొస్తులుడు అనగా పంపబడినవాడు అని అర్థం.] పని చేయటానికి రమ్మని నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి నన్ను ప్రత్యేకించినాడు.
అందువల్ల రోము పట్టణంలో ఉన్న మీ అందరికీ వ్రాయుటమేమనగా మీరు దేవునికి ప్రియమైన వాళ్ళు. ఆయిన మిమ్మల్ని తన ప్రజగా ఉండటానికి పిలిచాడు. మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించి మీలో శాంతి కలుగుజేయునుగాక!
నేను ప్రార్థనలు చేసినప్పుడెల్లా విడువకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొంటాను. దానికి ఆ దేవుడే సాక్షి. చివరకు ఇప్పుడైనా నేను మీ దగ్గరకు రావటానికి దైవేచ్చవల్ల మార్గం ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను.
సోదరులారా! నేను, మిగతా యూదులుకాని వాళ్ళనుండి ఫలం పొందినట్లే మీ నుండి కూడా ఫలం పొందాలని, మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని ఇప్పటి వరకు ఆటంకాలు కలిగాయి. ఈ విషయం మీరు గ్రహించాలని నా కోరిక.
ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడివుంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, “విశ్వాసంవల్ల నీతిమంతుడైన వాడు అనంతజీవితం పొందుతాడు” [✡ఉల్లేఖము: హబక్కూకు 2:4.] అని వ్రాయబడి ఉంది.
కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటినుండి సృష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
ఎందుకంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అందకారమైపోయాయి.
ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు.
దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్!
పురుషులు కూడా ఈ విధంగా చెయ్యటం వల్ల, దేవుడు వాళ్ళను సిగ్గుమాలిన తమ కోరికలకు వదిలివేసాడు. వాళ్ళ స్త్రీలు కూడా సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు.
అదే విధంగా, పురుషులు కూడా స్త్రీలతో సహజ సంపర్కాలు వదిలివేసి పురుషులతో సంపర్కం పొందాలనే కోరికలతో చెలరేగి పోయారు. పురుషులు పురుషులతో అసహజమైన సహవాసాలు చేసి తమ అసహజతకు తగిన శిక్షను స్వయంగా అనుభవిస్తున్నారు.
ఇతర్లను నిందిస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, ఇతర్లపై దౌర్జన్యం చూపుతూ, గర్విస్తూ, బడాయిలు చెప్పుకొంటూ జీవిస్తూ ఉంటారు. దుర్మార్గపు పనులు చెయ్యటానికి రకరకలా మార్గాలు కనిపెడ్తూ ఉంటారు. అంతేకాక తమ తల్లిదండ్రుల పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు.
దేవుని నీతి నియమములకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళకు మరణ శిక్ష తప్పదని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండటమే కాకుండా ఆ పనులు చేసే వాళ్ళను మెచ్చుకొంటూ ఉంటారు.